‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మాజీ మంత్రి శంకరనారాయణ కు చేదు అనుభవం..

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మాజీ మంత్రి శంకరనారాయణ కు చేదు అనుభవం ఎదురైంది.
ఈ కార్యక్రమంలో మొదటి నుండి కూడా నేతలకు ప్రజల నుండి షాక్ లు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో మాజీ మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన సెగ ఎదురైంది. ఇంటిముందుకు వచ్చిన శంకరనారాయణఫై ఓ మహిళా విరుచుకుపడింది.

11 నెలలుగా పింఛన్‌ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పక్కనున్న నేతలు , కార్యకర్తలు ఆమెను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ , ఆమె ఏమాత్రం ఆగకుండా శంకరనారాయణ నిలదీసింది. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో మళ్లీ వస్తానంటూ శంకరనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో ఎసరు మహిళా ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. “నిలబడి సమాధానం చెప్పలేరా ?” అంటూ నిలదీసింది. ఇంటి సభ్యులు అంతా సముదాయిస్తున్నా ఆమె శాంతించలేదు. “ఈసారి ఓట్లడగడానికి వస్తారుగా అప్పుడు చూస్తా” అంటూ ఆమె హెచ్చరించింది.