ఖమ్మం జిల్లాలో 10 కి 10 గెలుస్తాం – రేవంత్ రెడ్డి ధీమా

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అందరిలో ఉత్సాహం పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ లో పార్టీ కి బలం వచ్చినట్లు అయ్యింది. అంతే కాక మొన్నటి వరకు మాజీ ఎంపీ పొంగులేటి , జూపల్లి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ లోకి వస్తారో రారో అనే సందేహాలు ఉండేవి కానీ వారు కాంగ్రెస్ లో చేరుతుండడం తో మరింత జోష్ నింపింది.

జూలై 2న ఖమ్మంలో జనగర్జన సభ ద్వారా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు 30 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సభ ద్వారానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కర్ణాటక ఫలితాల ఊపును తెలంగాణలోనూ కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది. ఒకవైపు భట్టి పాదయాత్ర ముగింపు, మరోవైపు భారీగా చేరికలు ఉన్న నేపథ్యంలో ఈ సభను రేవంత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం కూడా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్‌ సభ ఉండాలని కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. తన సొంత జిల్లాలో తన బలం, బలగం చూపించాలని ఆయన అనుకుంటున్నారు.

ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్ కు సమాధి కడతామని , ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. బంగాళాఖాతంలో పడేస్తామని , ఖమ్మం జిల్లాలో పదికిపది సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఈ సారి పువ్వాడ అజయ్ గెలవడం అసాధ్యమన్నారు . జూలై 2న ఖమ్మంలో జనగర్జన సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. సభకు డబ్బులు కట్టి బస్సులు అడిగితే ఇవ్వట్లేదన్నారు. ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ సభకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంటలిజెన్స్ అధికారులు వీడియోలు తీసి కేసీఆర్ కు పెట్టాలని చెప్పారు. జూలై 2న ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుందన్నారు.

ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారని అన్నారు. భట్టి విక్రమార్కఆదిలాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్లు నడిచారని అందుకే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని రేవంత్ అన్నారు.