గిరిజనులపై పెట్టిన పోడుభూముల కేసులన్నీ కొట్టేస్తాం – కేసీఆర్ కీలక ప్రకటన

గిరిజనులకు పోడుభూముల పట్టాలను అందజేయడమే కాదు వారి ఫై ఉన్న కేసులను కూడా కొట్టివేస్తునట్లు ప్రకటించి గిరిజనుల్లో మరింత సంబరాలు నింపారు సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా నేడు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మందికి పోడు పట్టాలను పంపిణీ చేసారు కేసీఆర్.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఉద్యోగులు, గిరిజనులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని మహిళల పేరుమీదుగానే ఈ పట్టాలను ఇస్తున్నామని తెలిపారు. పోడు భూములపై ఉన్న కేసులను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. దీని కోసం ఈ సందర్భంగా రూ.23కోట్ల 59 లక్షల 90వేలను చెక్కులు విడుదల చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని..ప్రతీఇంటికి నీరు అందిస్తున్నామని తాగునీటి కష్టాలు తీర్చామని తెలిపారు. కార్యక్రమంలో కొందరు గిరిజన రైతులకు రైతుబంధు చెక్కులను అందజేశారు. ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్‌ కరెంటు ఇస్తామని సీఎం ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తాను ఏ పిలుపునిచ్చినా ఉద్యోగులు శక్తివంచన లేకుండా తమవంతు కృషిచేశారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. అందరి సహకారం వల్లే నాడు స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని కేసీఆర్ అన్నారు.