మా పతకాలను గంగా న‌దిలో విసిరేసి..ఇండియా గేట్ వ‌ద్ద నిరాహారదీక్ష చేస్తాం: రెజ్ల‌ర్లు

Will immerse our medals in Ganga, sit on hunger strike at India Gate, say protesting wrestlers

న్యూఢిల్లీ : మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌కు వ్య‌తిరేకంగా టాప్ రెజ్ల‌ర్ల ఢిల్లీలోని జంతర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వాళ్లు త‌మ మెడ‌ల్స్‌ను గంగా న‌దిలో విసిరేసి ఇండియా గేట్ వ‌ద్ద నిరాహార దీక్ష‌కు దిగుతామ‌ని రెజ్ల‌ర్లు హెచ్చ‌రించారు. ప్ర‌ముఖ రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యం స్ప‌ష్టం చేశారు. హ‌రిద్వార్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు గంగా నదిలో మెడ‌ల్స్ విసిరేస్తామ‌ని, ఈ మెడ‌ల్స్ త‌మ‌కు జీవనాధార‌మ‌ని, ఇవే త‌మ ఆత్మ‌ల‌ని ఆమె పేర్కొన్నారు.

గంగా న‌దిలో ఈరోజు వాటిని ప‌డేసిన త‌ర్వాత తాము బ‌త‌క‌లేమ‌ని, ఆపై ఇండియా గేట్ వ‌ద్ద నిరాహార దీక్ష చేప‌డతామ‌ని చెప్పారు. వినేష్ పొఘ‌ట్‌, సాక్షి మాలిక్‌, భ‌జ‌రంగ్ పునియా స‌హా ప‌లువురు టాప్ రెజ్ల‌ర్లు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌, బిజెపి ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 23న జంతర్ మంత‌ర్ వ‌ద్ద రెజ్ల‌ర్లు నిర‌స‌న‌ల‌కు శ్రీకారం చుట్ట‌గా నూత‌న‌ పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అథ్లెట్ల‌పై ఢిల్లీ పోలీసులు అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఫొటోలు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి.