రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై స్టేట్ జీఎస్టీ దాడులు

బిజెపి నేత , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు దాడులు చేపట్టారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో తనిఖీలు చేపట్టారు. సుమారు మూడు గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తూ.. సుశీ ఇన్ ఫ్రాపై జీఎస్టీ ఆఫీసర్లు సోదాలు చేస్తున్నారు. సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు.

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకురుమల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన డబ్బులను వెనక్కి తీసుకుందంటూ నిరసనకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10వేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.