వచ్చే ఎన్నికల్లో పోటీపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే పోటీ చేస్తా..

jd lakshmi narayana
jd lakshmi narayana

అమరావతిః ప్రజా సేవ కోసం ఉద్యోగం వదులుకుని వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ప్రజలతో మమేకమవుతూ, వారిని కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలు కనుక తన ఆలోచనలకు దగ్గరగా ఉంటే ఆలోచిస్తానని, లేదంటే విశాఖపట్టణం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు జేడీ ఫౌండేషన్, ఐఏసీఈ సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చిన ఉచిత శిక్షణలో మంచి ఫలితాలు సాధించినట్టు చెప్పారు. మొత్తం వెయ్యిమందికి శిక్షణ ఇస్తే ప్రాథమిక పరీక్షల్లో 98.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఐఏసీఈ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.