ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో మరొకరు మృతి

24 గంటల వ్యవధిలో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నదిని దాటి ఏనుగు ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు బీబత్సం సృష్టిస్తుంది. ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఈ గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మూడేళ్ల కిందట సైతం ఇదే ప్రాంతంలో పులి పంజాకు ఇద్దరు యువకులు బలయ్యారు. నవంబరు 2021లో కొండపల్లి గ్రామ శివారు ప్రాంతంలోనే నిర్మల అనే యువతి పులి దాడిలో చనిపోగా, తాజాగా ఇప్పుడు ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం చెందారు.

బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో మిరపకాయలు ఏరుతున్న అల్లూరి శంకర్‌ (55)ను తొండంతో కొట్టి చంపిన ఏనుగు 24 గంటలు కూడా గడవకముందే నిన్న తెల్లవారుజామున పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు కారు పోశన్న (65)ను తొక్కి చంపేసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తున్న ఆయనపై దాడిచేసిన ఏనుగు ఒక్కసారిగా దాడిచేసి చంపేసింది. వరుస ఘటనలతో జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.విషయం తెలిసిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద బైఠాయించి పోశన్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ వేణు బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఏనుగును బంధించేందుకు మహారాష్ట్ర నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. అలాగే, ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.