ఉక్రెయిన్ లో జీవాయుధ దాడికి ర‌ష్యా ప‌న్నాగం : అమెరికా

White House Warns Russia May Launch Chemical Attack In Ukraine

వాషింగ్టన్: ఉక్రెయిన్ లో అమెరికా రహస్యంగా జీవాయుధాల అభివృద్ధి కార్యక్రమం చేపడుతోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై అమెరికా ఘాటుగా స్పందించింది. ఉక్రెయిన్ లో తాము ఎలాంటి జీవాయుధాల అభివృద్ధి కార్యక్రమం చేపట్టడంలేదని స్పష్టం చేసింది. రష్యా వ్యాఖ్యలు చూస్తుంటే, త్వరలోనే ఉక్రెయిన్ లో జీవాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేసింది. తాజా ఆరోపణలే రష్యా ఎత్తుగడలకు సంకేతాలు అని పేర్కొంది.

క్రెమ్లిన్ అధినాయకత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఉక్రెయిన్ లో భయానక దాడులకు దిగేముందు తన చర్యలను సమర్థంచుకోవడానికి అమెరికాపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రష్యా చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమైనవని, చైనా అధికారులు కూడా ఇలాంటి కుట్ర సిద్ధాంతాలనే వినిపిస్తుండడం గమనించాలని పేర్కొన్నారు. రష్యా నోట జీవాయుధాల మాట వినిపించిన నేపథ్యంలో, ఉక్రెయిన్ లో ఆ మేరకు జీవాయుధాలు, రసాయన ఆయుధాలు ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయని, అన్ని దేశాలు రష్యాపై ఓ కన్నేసి ఉంచాలని జెన్ సాకీ పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/