అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తాం – బండి సంజయ్

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బైంసాను దత్తత తీసుకుంటామని..బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర సభలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు జరిగారు. భైంసాలో హిందువులు పండుగలు జరుపుకోకుండా ఎంఐఎం, వేధింపులకు గురి చేశాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడాలని బండి సంజయ్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపే కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కు మూడిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని బైంసాకు రాకుండా నిషేధించారని, బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బైంసాకు రావాలంటే వీసా తీసుకుని రావాలా? అని నిలదీశారు.

“మనం ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నాం? టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి బైంసాలో హిందువులపై దాడులు చేశాయి. భైంసా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. భైంసా అంటే కెసిఆర్ కు సాధారణంగానే భయం ఉంటుంది. ఈ సభ చూసిన తర్వాత సీఎం కెసిఆర్ రెండు పెగ్గులు తాగేవాడు ఫుల్ బాటిల్ తాగుతాడు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే మనవాళ్ల గురించి ఆలోచిస్తాము. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేస్తాము “అన్నారు.