గుజరాత్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచార పర్వం ఈరోజుతో ముగిసింది. డిసెంబర్ 01 న మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 57 మంది అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే బరిలో నిలిపింది. చివరి రోజున బీజేపీ దాదాపు 160 ప్రాంతాల్లో పబ్లిక్‌ మీటింగ్స్‌ పెట్టింది. మూడు జిల్లాల్లో అమిత్‌షా, భావ్‌నగర్‌లో జేపీ నడ్డా, మాండ్వి, గాంధీధామ్‌లలో స్మృతి ఇరానీ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు.

ఇక 19 జిల్లాల్లో జరుగనున్న ఓటింగ్‌లో దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఇక రెండో ఫేజ్ డిసెంబర్ 5న జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటించనున్నారు.