జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు సంగతి ఏంటి..?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు రాజకీయంగా చర్చ గా మారింది. జులై 4 న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజులపాటూ ఆయన ఢిల్లీలోనే మకాం వెయ్యబోతున్నారు. జులై 5వ తేదీ ఉదయం ఆయన ప్రధాన మంత్రి మోడీ తో భేటీ అవుతారని తెలిసింది. అలాగే… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా జగన్ కలుస్తారని సమాచారం. గత నాలుగేళ్లుగా ప్రతినెలా జగన్ ఢిల్లీ బాట పడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

గత నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి ఏ మూలకు సరిపోవడం లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. అమ్మఒడికి బటన్ నొక్కారు. కానీ ఇంతవరకు తల్లుల ఖాతాల్లో నిధులు జమకాలేదు. ఉద్యోగుల జీతాలు సైతం చెల్లించలేదు. పదో తేదీ గడిస్తే కానీ పూర్తిస్థాయిలో జీతాలు చెల్లింపులు జరిగేలా లేవు.

రాజకీయంగా కూడా ఏమంతా పరిస్థితి బాగాలేదు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనట్టు అని అర్ధం అవుతుంది. వాటికి బీజేపీ తోడైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశముంది. మరోపక్క ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఆపసోపాలు పడే చాన్స్ ఉంది. అందుకే టీడీపీ, జనసేన వైపు వెళ్లకుండా బీజేపీ పెద్దలను విన్నవించే అవకాశముంది. ఎంపీ సీట్లు ఎక్కువగా వైసీపీకి వచ్చే అవకాశమున్నందని.. అవసరమైన పక్షంలో ఎన్డీఏకు వెన్నుదన్నుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చే అవకాశముంది.

ఇమరొపక్క ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో మళ్లీ మొదలైంది. అలాగే.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తాజా చార్జిషీట్ సమర్పించబోతోంది. అటు ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై మూడున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల మధ్య సీఎం జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.