ఈనెల 30న ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఈనెల 29న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రధాని మోడి అధ్యక్షతన ఈనెల 30న అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. అయితే ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది. కాగా, అదేరోజున బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు కూడా సమావేశం కానున్నాయి.

కరోనా నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈసారి రెండు విడుతలుగా జరుగుతాయి. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభమై ఏప్రిల్‌ 8న ముగుస్తాయి. తొలివిడుత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, రెండో విడుత మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వరకు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందున రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగనుంది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈసారి బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తేనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆర్థిక నిపుణులు, వ్యాపారవేత్తలు ఓ దఫా సమావేశం నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ నెల 30 న ప్రధాని మోడి అన్ని రాజకీయ పక్షాల సలహాలను స్వీకరించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/