ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలిః ప్రధాని మోడీ పిలుపు

pm-modi

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటర్లకు కీలక సందేశాన్నిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రజలను కోరారు. యువత, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు తొలి దశ పోలింగ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లిష్, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ, అస్సామి భాషల్లో ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి గొంతు ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు.

‘‘ 2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభమవనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటు హక్కు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటర్లు ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఎంతైనా ప్రతి ఓటు విలువైనదే. ప్రతి గొంతు ముఖ్యమైనదే!’’ అని ట్వీట్‌లో మోడీ పేర్కొన్నారు.