విజయనగరం రైలు ప్రమాద ఘటనలో 14 ‘కు చేరిన మృతుల సంఖ్య..

ఆదివారం రాత్రి లో విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య పెరుగుతుంది. మొదట 5 గా భావించిన నేటికీ 14 కు చేరింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో ట్రైన్ నెం 08532 విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద ఆగిపోయింది. మూడు లైన్లు ఉండగా మధ్య లైనులో రైలు నిలిచింది. ఆ వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ – పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి.

కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఫలితంగా ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం. రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడమే కాకుండా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది సర్కార్.