విజయనగరం ట్రైన్ ప్రమాదానికి కారణాలు ఏంటి..?

ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ట్రైన్ నెం 08532 విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద ఆగిపోయింది. మూడు లైన్లు ఉండగా మధ్య లైనులో రైలు నిలిచింది. ఆ వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ – పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి.

కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఫలితంగా ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం. రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం.ఇక ఈ ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ కారణమని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ లోపం వల్లే విశాఖపట్టణం-పలాస, విశాఖ-రాయగఢ ఒకే ట్రాక్‌పై పరస్పరం ఢీకొన్నట్లు చెపుతున్నారు. భారత దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిన ఒడిషా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ తరహాలోనే విజయనగరం ప్రమాదం సైతం జరిగింది.

ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపం వల్ల మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది వరకు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత అప్డేటేడ్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ‘కవచ్’ టెక్నాలజీపై విజయనగరం ఘటనతో మరోసారి అనుమానాలు తలెత్తున్నాయి.