మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలి : వీరేంద్ర సెహ్వాగ్

పేరు మనలో గర్వాన్ని నింపేలా ఉండాలన్న సెహ్వాగ్

virender-sehwag-welcomes-renaming-of-india-name-to-bharat

న్యూఢిల్లీః ఇండియా పేరును భారత్ గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతోందనే ప్రచారం ఊపందుకుంది. జీ20 దేశాధినేతలకు ఈ నెల 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా… ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. దీంతో, మన దేశం పేరును మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.

‘పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్ ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. వన్డే ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐను, జైషాను కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.