బీఆర్ఎస్ పాలనపై 154 అంశాలతో బీజేపీ ఛార్జ్​షీట్ విడుదల

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి మరింత దూకుడు పెంచుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై విమర్శలు కురిపిస్తూ వస్తుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పాలనపై 154 అంశాలతో కూడిన ఛార్జ్​షీట్ ను విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు అంటూ బీజేపీ చార్జ్‌షీట్ కమిటీ చైర్మన్ మురళీధరరావు విడుదల చేసారు. 2014, 18 మేనిఫెస్టోతో పాటు.. అసెంబ్లీ, సభల్లో కేసీఅర్ ఇచ్చిన హామీలు, అవినీతిని ఈ ఛార్జ్​షీట్​లో ఎండగట్టింది బీజేపీ.

ఇసుక, గ్రానైట్, ల్యాండ్, డ్రగ్, లిక్కర్, కాంట్రాక్ట్ మాఫియా అన్నింట్లో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ ఛార్జ్​షీట్​లో ఆరోపించింది. సంక్షేమం పేరుతో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో గులాబీ నేతలకు వాటా ఉందని.. వారంతా కమీషన్లు వసూల్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం నేడు కల్వకుంట్ల కుటుంబ పరమైందని మండిపడింది.

రైతును రాజునుచేస్తానని చెప్పిన కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని ఛార్జ్‌షీట్‌లో బీజేపీ ప్రస్తావించింది. సాగుకి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామనేది వాస్తవం కాదని తెలిపింది. ఏకకాలంలో రుణమాఫీ జరగలేదని చెప్పింది. దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి మొదలు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు వరకు దగా చేసిందని.. ఇలా 154 అంశాలపై బీజేపీ తన ఛార్జ్​షీట్​లో ప్రస్తావించింది.

ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ… భగవంతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడుకి చెప్పినట్లుగా తెలంగాణలో అవినీతిలేని చోటు లేదన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి అన్నారు. ఎన్నికలకు ముందు భగవంతుడే తీసుకువచ్చాడా? అన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపం బయటపడిందన్నారు. అవినీతి విషయంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు.

నీటి పారుదల, పేపర్ లీకేజీలు, రైతు బంధు సహా రైతుల అంశాలు… ఇలా ఎన్నోచోట్ల అవినీతి జరిగిందన్నారు. అందుకే తమ చార్జ్ షీట్‌లో ఈ అంశాన్నింటిని ప్రస్తావించామన్నారు. దేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చునన్నారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదన్నారు. రుణమాఫీ వడ్డీలకే సరిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఒక్కటీ ఏర్పాటు చేయలేదన్నారు. దళిత ముఖ్యమంత్రి మొదలు దళితబంధు వరకు అన్నీ అబద్ధపు హామీలే ఇచ్చారన్నారు.