టిడిపి నేతలను ట్విట్టర్ లో ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

కేసులన్నీ రాజకీయ కుట్రే అయితే చంద్రబాబుకు బెయిల్ ఎందుకు రావట్లేదు?.. విజయసాయిరెడ్డి

Vijayasai Reddy questioned TDP leaders on Twitter

అమరావతిః టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనేదే లేదని, కుట్రపూరితంగా చంద్రబాబును జైలుకు పంపారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని మండిపడుతున్నారు. దీనిపై వైఎస్‌ఆర్‌సిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు.

చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే అయితే ఆయనకు బెయిల్ ఎందుకు రావడంలేదని ట్విట్టర్ లో ప్రశ్నించారు. న్యాయ స్థానాలు ఆయన వాదనను ఎందుకు పట్టించుకోవడంలేదని అడిగారు. ఇంతకీ రాష్ట్రంలో న్యాయ స్థానాలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని మీరు భావిస్తున్నారా లేక వాటిపైన కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా.. అంటూ టిడిపి నేతలను నిలదీశారు. ప్రస్తుత కేసు ‘పాపాల్లో ఈదుతూ విషాదంలో మునిగిన హీరో కథ’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.