అమిత్ షాపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ అవినీతికి కంచె వేసి కాపాడుతున్నది అమిత్ షానే అన్న రేవంత్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హోంమంత్రి స్థాయిలో అమిత్ షా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి కంచె వేసి కాపాడుతోంది అమిత్ షానే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర హోంశాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని… ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

బీజేపీకి టీఆర్ఎస్ డబ్బులు పంపుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ డబ్బులే వెళ్లాయని అన్నారు. సొంత పార్టీ నేతలపై కూడా సీబీఐ విచారణ జరిపిన బీజేపీ… కేసీఆర్ పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ పై ఉన్న సీబీఐ కేసులను ఎందుకు తొక్కి పెట్టారని రేవంత్ ప్రశ్నించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసును ఎనిమిదేళ్లుగా తొక్కి పెట్టింది బీజేపీనే అని మండిపడ్డారు. కేసీఆర్ ను బీజేపీ బొక్కలో వేయకపోవడానికి కారణం… కేసీఆర్ వేసే బొక్కలేనని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/