ఫిలిం స్టార్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ: విజయసాయిరెడ్డి

స్థూల రాష్ట్ర ఉత్పత్తి కోసం చెమటోడుస్తున్నారని ఎద్దేవా

vijayasaireddy

అమరావతిః సినీ రంగంపై వైఎస్‌ఆర్‌సిపి నేతల విమర్శలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ చిరంజీవిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. కొందరు హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ, వీలైతే ఉచితంగా నటిస్తూ, లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. కళామతల్లిపై ప్రేమతో సినిమాలు చేస్తున్నారని, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారని సెటైర్ వేశారు. అలాంటి హీరోలకు హ్యాట్సాఫ్ అని అన్నారు.

సినీ రంగం ఆకాశం నుంచి ఊడి పడలేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ఫిలిం స్టార్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పారు. పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని అన్నారు. వారి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని చెప్పారు. వారి యోగ క్షేమాలను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు.