బిజెపి తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ కీలక నేత, పారిశ్రామికవేత్త వీటి విజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిలోకి వలసలు ఆగడం లేదు. రాజకీయ నేతలు , పారిశ్రామికవేత్తలు వరుస పెట్టి జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ కీలక నేతలు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుండి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ , దాసోజు శ్రవణ్ , బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగానంద్ కొల్లూరులు చేరగా..తాజాగా శంషాబాద్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, పారిశ్రామికవేత్త వీటి విజయ్ కుమార్ బీజేపీలో చేరారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని విజయ్ కుమార్ భావిస్తున్నట్లు వినికిడి. కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ తులసీరామ్ చిన్న కుమారుడే విజయ్ కుమార్. తెలంగాణ తొలితరం ఉద్యమంలో పాల్గొన్న తులసీ రామ్.. పెద్దపల్లి, కరీంనగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో తులసీరామ్.. చేవెళ్ల ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తులసీరామ్ పెద్ద కుమారుడు వీటి ప్రకాష్ రాజేంద్రనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి చైర్మన్ గా పనిచేశారు.