జైలుకు అలవాటు పడిన జగన్ అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారన్న వెలగపూడి

జైలుకు అలవాటు పడిన జగన్ అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఘటన లో జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయడం ..పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్య క్రమాలను అడ్డుకోవడాన్ని వెలగపూడి తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని అన్నారు. వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన తుస్సుమందని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ విశాఖలో అడుగు పెట్టిన వెంటనే విశాఖ గర్జన గాల్లో కలిసిపోయిందని అన్నారు. ఆ అక్కసుతోనే జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు హుందాగా వ్యవహరించడం లేదని… ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ కు జైలు జీవితం అలవాటని… అందుకే అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. అందుకే ఇతర పార్టీల నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని చెప్పారు.