చంద్రబాబు కంటతడి ఫై పవన్ స్పందన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్‌ మీట్‌ లో కన్నీరు పెట్టుకోవడం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబునాయుడు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని పవన్ అన్నారు.

ఓ పక్క రాష్ట్రాన్ని వరదలు అల్లకల్లోలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఇటీవల కాలంలో సభలు, సమావేశాలు, ఆఖరికి టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. తాజాగా శాసనసభలో గౌరవనీయ విపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం అని తెలిపారు.

గతంలో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువచేసి మాట్లాడినప్పుడు తాను ఇలాగే ఖండించానని పవన్ తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు అర్ధాంగిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నానని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు. మహిళల గౌరవమర్యాదలకు హాని కలిగించే ధోరణులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఉద్ఘాటించారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, లేకపోతే ఒక అంటువ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని తెలిపాడు.