ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తాంః చంద్రబాబు

తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు

chandrababu public meeting in Anakapalle District Madugula

అమరావతిః వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు గెలవాలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పారు. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అన్నారు. విశాఖను క్రైమ్ సిటీగా, గంజాయి కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. జగన్ వందల కోట్లు దోచిపెట్టాడని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో గంజాయి అమ్ముతూ దొరికిపోయారని అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసే బాధ్యత తమదేనని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఆడబిడ్డలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు ఇస్తామని అన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నారని తెలిపారు.

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. రైతును రాజుగా చేస్తామని.. ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే వచ్చి అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు. సిద్ధం అన్న జగన్ సందిగ్ధంలో పడిపోయారని… ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు ఏబీసీడీలు కూడా తెలియవని చెప్పారు. జగన్ ను రాజకీయాల నుంచి తరిమేయాలని అన్నారు. అమరావతి మన రాజధాని, విశాఖ మన ఆర్థిక రాజధాని అని చెప్పారు.