శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఉపదేశం

ఆది మధ్యాంతర రహిత శక్తి

Vasavi Ammavari mahatyam
Vasavi Ammavari mahatyam

‘ఓ జగన్మాతా! సామాన్యులకు కూడా నీ సాన్నిధ్యము లభించు సులభ మార్గమును దయతో ఉపదేశించు, అని భాస్కరాచార్యుడు ప్రార్థించాడు వాసవీ కన్యకా పరమేశ్వరిని. అప్పుడు ఆ దేవి ఇలా చెప్పింది. ‘నన్ను సర్వోత్కృష్టమైన అనురాగముతో చింతించు భక్తుడు నన్ను తనకు వేరుగ తలపక అభేదముగ భావించగలడు.

ఎవరు సమస్త జీవులలో నన్ను చూడగలడో, ఎవడు తనను తాను ప్రేమించునట్లు సమస్త జీవులను ప్రేమించగలడో, ఎవడు నన్ను అన్ని రూపాలతో అంతట నుండు శుద్ధ చైతన్య రూపిణిగ ఎరుగగలడో, సద్విప్రులు మొదలు చండాలుర వరకు గల సమస్త జనులను ఎవడు సమభావంతో సమాదరించగలడో.

ఎవడు ఈ అనంత విశ్వమందు నేను తప్ప రెండవ పదార్థమే లేదన్న నమ్మికగల వాడగునో, ఎవడు ఏ జీవికినీ అపకారము చేయదలచని వాడగునో ఎవడు దేహాభిమానమును, సిగ్గును, బిడియమును వదలి నా నామసంకీర్తనాదులను పాడుచు ఆడునో ఆ పరమభాగవతోత్తముడు నన్ను చేరగలడు. సర్వోపనిషత్తుల సారము, అద్వైతామృతము ఉంది .

కన్యకా పరమేశ్వరి చేసిన ఈ చిన్న ఉపదేశములో ఆ తర్వాత బాహ్యపూజ ఎలా చేయాలో చెప్పి అంతరపూజ, అత్యంత విలువైన పూజను గురించి ఇలా చెబుతుంది. నిరాకార నిర్వికార శుద్ధ, బుద్ధ, ముక్తజ్ఞానము మాత్రమే నా యదార్థ రూపమై యున్నది.

త్రాటియందు తోచిన పామువలె, ఎండమావుల నీటివలె, స్వప్న పదార్థమువలె నొప్పు అసత్య జడ దుఃఖాత్మకమగు ఈ జగమంతయు మాయామయమని తెలిసికొని నా చిద్రూపమునందే చిత్తమును నిలువవలెను. ఇంత ఉన్నతమైన, ఉదాత్తమమైన బోధను చేసిన వాసవిని ఒక కులానికి పరిమితం చేయటం, ఒక కులదేవతగా భావించటం అనంతమైన ఆకాశాన్ని గుప్పిటలో బంధించే అర్ధరహిత ప్రయత్నమవుతుంది.

వాసవి ఆది మధ్యాంతర రహిత శక్తి, సచ్చిదానంతమూర్తి. ఆమె ఏదో ఒక కాలానికో, కులానికో, ప్రాంతానికో చెందినది కాదు. ఆమెను భక్తితో పూజిస్తే మంచిదే. కానీ ఆమె బోధను బుద్ధితో గ్రహించి తదనుగుణంగా జీవిస్తే ఇంకా మంచిది. సర్వకాల సర్వావస్థలలోనూ శ్రేయోదాయకమైనది ఆ దివ్యబోధ – కోటి శాస్త్రాల సారాంశం అది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/