నారా లోకేష్ తో కలిసి పాదయాత్ర చేసిన వంగవీటి రాధా

యువగళం పేరుతో నారా లోకేష్ గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యాత్రను లోకేష్ ప్రారంభించగా..ఈ యాత్ర లో వంగవీటి రాధా పాల్గొని ఆశ్చర్యపరిచారు.

గత కొద్దీ రోజులుగా రాధా టీడీపీని వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా ..ఈరోజు రాధా స్వయంగా లోకేష్ యాత్ర లో పాల్గొనడం తో అందరిలో ఉన్న అనుమానాలకు తెరపడినట్లు అయ్యింది. లోకేష్ యాత్ర లో స్వయంగా రాధ పాల్గొనడం… తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించడంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.

లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన వంగవీటి రాధా… ముందుగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాదయాత్రలో తనతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. నడుస్తూనే మధ్యలో తన అనుచరుల్ని లోకేష్ కు పరిచయం చేశారు. దీంతో లోకేష్ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.

ఈ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం దగ్గర ముస్లిం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదన్నారు. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో టీడీపీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు.