సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్?

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ సర్వీస్ లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం..ఇప్పుడు తెలంగాణ లో కూడా ఈ వందే భారత్ రైలు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. ముందుగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి లేదా బెంగళూరు, ముంబై ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించాలని అధికారులు అనుకున్నారు. కానీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్‌లు ఉండవు. కేవలం కూర్చోని మాత్రమే ప్రయాణం చేసేలా సీటింగ్ ఉంటుంది. దీని వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి అసౌకర్యంగా ఉంటుంది.

దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ఎక్కువసేపు కూర్చోని ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దగ్గర ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా సికింద్రాబాద్-విజయవాడ స్టేషన్ల మధ్య సర్వీస్ ను నడిపించాలని రైల్వేశాఖ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ఎక్కువమంది ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ రూట్‌లో ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇక పండగల సమయంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రూట్ లో సర్వీస్ నడిపితే బాగుంటుందని ఆలోచిస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణానికి 6 గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను నడిపిస్తే నాల్గు గంటల్లో గమ్య స్థానాన్ని చేరుకుంటారు. ప్రయాణికులకు కూడా రిలాక్స్ అవుతారని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన తెలుపనున్నట్లు రైల్వే చెపుతుంది. అన్ని కుదిరితే న్యూ ఇయర్ నుండి ఈ సర్వీస్ అందుబాటులోకి రావొచ్చు.