సోనియా పుట్టిన రోజు సందర్బంగా బోయిన్పల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. ఇక తెలంగాణ లోను సోనియా పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. రాష్ట్రంలోని పలు హాస్పటల్స్ కు వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు.. చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే పలు చోట్ల వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారికి తమ వంతు సేవలు అందించారు. ఇంకొన్ని చోట్ల అన్నదాన, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి ప్రారంభించారు. రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలను రేవంత్ రెడ్డి అభినందించారు.

మరోపక్క సోనియా పుట్టిన రోజు సందర్బంగా దేశ ప్రధాని మోడీ..ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సోనియా గాంధీ జైపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. హెలికాప్టర్‌లో సవాయ్ మాధోపూర్‌కు వెళ్లారు. అనంతరం రణతంబోర్‌లోని షేర్ బాగ్ హోటల్‌లో బస చేసినట్టు నేతలు తెలిపారు.