రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావడం చారిత్రాత్మక అవసరం: గంటా

జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్య

ganta-srinivasa-rao-wishes-chandrababu-on-his-birth-day

అమరావతిః నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘సంపద కంటే విజ్ఞానమే గొప్పదని, ఆ విజ్ఞానమే మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని, ప్రపంచమే నీ ముందు తలవంచుతుందని నమ్మిన ఎకైక నాయకుడు, రేపటి భవిత కోసం ప్రజలే తన కుటుంబం అనుకుని కష్టపడే నిత్యవిద్యార్థి మా అన్న చంద్రబాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావడం చారిత్రాత్మక అవసరమని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అందుకే బాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా.. ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని తెలిపారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. వచ్చే ఎన్నికల్లో బాబు సీఎం కావడం అంతే నిజమని చెప్పారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాల్లోనే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మొదటి స్థానంలో నిలబడిందని విమర్శించారు.

జగన్ ప్రభుత్వానికి నెలలు కాదు.. ఇంకా రోజులే ఉన్నాయని గంటా అన్నారు. జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో ఒక ఇటుక వేయలేదని.. ఇప్పుడు పోర్ట్, ఎయిర్ పోర్టు కడతామంటే ఎవరూ నమ్మరన్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చేస్తామంటే.. ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు.

చంద్రబాబు జన్మదిన వేడుకలను విశాఖపట్నం టిడిపి పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. జిల్లా నాయకులతో కలిసి కేక్ కట్ చేశామని, తర్వాత రక్తదాన శిబిరం నిర్వహించారని గంటా ట్వీట్ చేశారు.