డైరెక్టర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూత..

yash-chopras-wife-pamela-chopra-passes-away-at-74

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా (74) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఈమె.. 15 రోజులుగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె కన్నుమూశారు. పమేలా 1970లో యశ్ చోప్రాను వివాహం చేసుకుంది. వీరికి ఆదిత్య చోప్రా ,ఉదయ్ చోప్రా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. పమేలా చోప్రా సుప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయని. పలు సినిమాల్లో పాటలు పాడిన ఆమె యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఆమె కభీ కభీ, ముజ్సే దోస్తీ కరోగే వంటి అనేక ప్రసిద్ధ పాటలను పాడింది. అవి నేటికీ అభిమానులకు ఇష్టమైనవిగా ఉన్నాయని చెప్పవచ్చు. పమేలా గాయనిగానే కాకుండా నిర్మాతగా, సహ రచయితగా కూడా పనిచేసింది. ఆమె స్వతంత్రంగా చిత్రాలను నిర్మించింది. యాశ్ చోప్రా, ఆదిత్య చోప్రా, రచయిత్రి తనూజా చంద్రతో కలిసి దిల్ తో పాగల్ హై స్క్రిప్ట్‌ను సహ రచయితగా చేసింది. దిల్ తో పాగల్ హై చిత్రంలోని ఓపెనింగ్ సాంగ్ ఏక్ దుజే కే వాస్తేలో కూడా పమేలా తెరపై కనిపించింది. ఇక యశ్ చోప్రా 2012లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.