భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

US President Joe Biden will visit India from September 7-10 to attend G-20 summit

న్యూఢిల్లీః అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సెప్టెంబర్‌లో భారత్‌ పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జీ20 (G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బైడెన్‌ భారత్‌కు వస్తున్నారు. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

20 దేశాల మధ్య జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బైడెన్‌ సెప్టెంబర్‌ 7 నుంచి 10వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్‌‌కి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉండగా, జీ20 సమ్మిట్‌ నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆ తేదీల్లో ఢిల్లీలోని అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసివేయనున్నారు.