త్వరలో బైడెన్, జిన్​పింగ్ సమావేశం

శాన్‌ఫ్రాన్సిస్కో సదస్సులో కలవనున్న అగ్రనేతలు

US President Joe Biden to meet Chinese counterpart Xi Jinping in November.. White House

వాషింగ్టన్‌: నవంబర్‌ నెలాఖరులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ , చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మధ్య కీలక సమావేశం జరుగనుంది. ఈ నెల చివర్లో శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగానే జో బైడెన్‌, జీ జిన్‌పింగ్‌ భేటీ కానున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌజ్‌ మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ వెల్లడించారు.

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్‌ పోరు నేపథ్యంలో బైడెన్‌, జిన్‌పింగ్‌ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే వీరి భేటీలో ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అంశం చర్చకు వస్తుందా..? లేదా..? అనే విషయంలో వైట్‌హౌస్‌ స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. ఇటీవల బైడెన్‌ టెల్‌ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు.

మరోవైపు డ్రాగన్‌ దేశం చైనా పాలస్తీనీయులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందని, అయితే అది అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఉండాలని చైనా సూచించింది. అంతేగాక పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల డ్రాగన్‌ పునరుద్ఘాటించింది. కాగా, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే అపెక్‌ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా బైడెన్‌ ఆహ్వానించారు.