అమెరికా అధ్యక్షుడి యుద్ధ అధికారాలకు కత్తెర!

US House votes
US House votes

వాషింగ్టన్‌ : ఇరాన్‌పై సైనిక దాడి చేసేందుకు అమెరికా అధ్యక్షునికి గల అధికారాలకు కత్తెర వేసే తీర్మానం గురువారం అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ ముందుకొచ్చింది. దీనిపై సభ చర్చించిన అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తుంది. ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి బుధవారం ఒక ప్రకటన చేస్తూ, ఇరానియన్‌ జనరల్‌ ఖాసిం సొలేమాని హత్య ‘కవ్వింపుతో కూడిన అక్రమ చర్య’గా అభివర్ణించారు. సెనెటర్‌ టిమ్‌ కైనీ కూడా ఇదే విధమైన ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానం డెమొక్రాట్లు మెజార్టీగా ఉన్న ప్రతినిధుల సభ ఆమోదం పొందడం సులువే. కానీ, రిపబ్లికన్ల ప్రాబల్యం కలిగిన సెనేట్‌లో ఇది ఆమోదం పొందడం కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ తీర్మానానికి అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ఉభయ సభల ఆమోదం లభించిన పక్షంలో 1973 యుద్ధ అధికారాల చట్టం కింద అధ్యక్షుడు దీనికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని డెమొక్రాట్లు పేర్కొన్నారు. ట్రంప్‌ సంతకం చేయనప్పుడు దానికి ఆయన బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. దీనిపై కోర్టులు కచ్చితమైన రూలింగ్‌ ఇచ్చే సూచనలేవీ కానరావడం లేదు. ఇరాక్‌లో సైనిక దళాలను ఉపయోగించేందుకు అధికారాలను దఖలుపరిచే 2002 ఆథరైజేషన్‌ చట్టాన్ని రద్దు చేసే విషయాన్ని పరిశీలించనున్నట్లు పెలోసి చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/