18 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలికిన కెనడా ప్రధాని దంపతులు

2005లో వివాహం బంధంలోకి అడుగుపెట్టిన జస్టిన్, సోఫీ

Canada’s PM Justin Trudeau and his wife announce separation

టొరంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్‌పై ఇరువురు సంతకాలు కూడా చేసినట్టు ట్రూడో కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రూడో(51), సోఫీ(48) 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు.

జస్టిన్, సోఫీ ప్రస్తుతం తమ పిల్లలను ఓ భద్రమైన ప్రేమపూరిత వాతావరణంలో పెంచడంపైనే దృష్టి పెట్టారని ట్రూడో కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయనియ తెలిపారు. కాగా, సోఫీ ఇప్పటికే ఒట్టావాలోని మరో నివాసానికి వెళ్లిపోయారని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రధాని పదవిలో ఉండగా భార్యకు విడాకులు ప్రకటించిన ప్రధానికిగా జస్టిన్‌ ట్రుడో నిలిచారు. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్‌ ట్రుడో కావడం విశేషం.