స్వప్నలోక్ కాంప్లెక్స్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు యువతీ యువకులు మరణించారు. ఇక ఈరోజు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాదం జరిగిన స్వప్పలోక్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ‘రాష్ట్రంలో జరగుతున్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు.. ఆ తర్వాత మర్చిపోతున్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండట్లేదు.’ అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదాయం కోసం ప్రభుత్వం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎక్కువ ఆదాయం వస్తోందని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
మరోపక్క ఈ ఘటన ఫై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి , మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.