ఎలాంటి మార్పులు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టనివ్వం – కరాటే కళ్యాణి

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పటు చేసారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడం తో శ్రీకృష్ణ జాక్, ఆదిబట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్స్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు..విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని స్టే విధించింది.

ఎన్టీఆర్ విగ్రహంలో ఎలాంటి మార్పులు చేసి, ప్రతిష్టించాలని ప్రయత్నించినా తాము అడ్డుకుంటామని కరాటే కల్యాణి పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించవద్దని డిమాండ్ చేస్తున్నారామె. NTR విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని మార్పులు చేసినా విగ్రహాన్ని పెట్టనివ్వమన్నారు. నెమలి పించం తీసేసినా, పిల్లన గ్రోవి తీసేసినా, విష్ణు చక్రం తీసేసినా అది శ్రీ కృష్ణుడు విగ్రహామే అవుతుందని, శ్రీ కృష్ణ పరమాత్ముడిని మరింత అపవిత్రం చేయవద్దని కోరారు. ఎన్టీఆర్ విగ్రహంతో రాజకీయం చేయడం తగదన్నారు కరాటే కల్యాణి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ముందుకెళ్తే తాము మరోసారి కోర్టుకెళ్తామని అన్నారు.