ఈరోజు ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా సామూహిక ‘జనగణమన’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు (ఆగస్టు 16) ఉదయం 11.30 గంటలకు సామూహిక ‘జనగణమన’ గీతాలాపన జరుగుతుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురసరించుకొని మంగళవారం సామూహిక జాతీయగీతాలాపన చేపట్టనున్నా రు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీవో) సర్కిల్‌ వద్ద నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఇందులో భాగస్వాములవనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసారు. ట్రాఫిక్‌ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇక నిన్న సోమవారం భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, ఎరువుల, విత్తనాల పంపిణీ.. రైతుబంధు సమితులు, వేదికలు, కల్లాల నిర్మాణం.. ఒకటా రెండా అనేక అద్భుతమైన పథకాలను సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేసీఆర్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి కూడా రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడిందని, రైతు బీమా ద్వారా ఇప్పటివరకు 84,945 రైతు కుటుంబాలకు 4,247 కోట్లను ప్రభుత్వం అందించి, మానవీయమైన పరిపాలనకు నిజమైన నిదర్శనంగా నిలిచిందన్నారు. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం నిర్మాణంతో కోటి ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీ ఆయకట్టును సృష్టించడం మునుపెన్నడూ జరగని అదృష్టం. పంజాబ్‌ తరువాత అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని తెలిపారు.