ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన కేంద్ర మంత్రి

బిఆర్ఎస్ తమ అవినీతి తెలంగాణ సమాజంతో ముడిపెడుతోందిః కిషన్ రెడ్డి

kishan-reddy

హైదరాబాద్‌ః ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులతో కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి సంబంధం లేదని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థల విషయాల్లో తాము జోక్యం చేసుకోమన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న కిషన్ రెడ్డి.. కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. తమ అవినీతిని తెలంగాణ సమాజంతో ముడిపెట్టిన ప్రజలను బిఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ సమాజం అంటే కల్వకుంట్ల కుటుంబం ఒక్కటేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నీతివంతులైతే ఈడీ కేసు విషయంలో గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. ‘తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలి. ఢిల్లీకి వెళ్లి మద్యం వ్యాపారం చేసింది ఎవరు? సెల్ ఫోన్లు ధ్వంసం చేసింది, అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి?’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.