మనీష్ సిసోడియా హత్యకు కుట్ర..ఆప్

తిహార్ జైలులో ప్రమాదకర నేరస్థుల మధ్య ఉంచడంపై ఆందోళన

Sisodia kept with murder in Tihar cell no 1, conspiracy to kill him: AAP

న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియా భద్రత విషయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన నేరస్థులను ఉంచే తిహార్ జైలుకు సిసోడియాను పంపించడంతో, ఆయన భద్రత పట్ల ఆందోళన చెందుతున్నట్టు ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. మొదటిసారి ఖైదీని ఎవరినైనా అలాంటి నేరస్థుల మధ్య లోగడ ఉంచారా? అని ప్రశ్నించారు.

విచారణలో ఖైదీని తీహార్ జైలు ఒకటో సెల్ కు పంపించడం ఇదే మొదటిసారి అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఒకటో సెల్ లో ప్రమాదకర నేరస్థుల మధ్య ఉంచినట్టు ఆరోపించారు. ‘‘విచారణలో ఉన్న వ్యక్తిని సెల్ నంబర్ 1లో ఉంచలేదు. ఎన్నో హత్యలకు పాల్పడిన వారు అక్కడ ఉన్నారు. కొందరు మానసికంగానూ దృఢంగా లేరు. మనీష్ సిసోడియాను విపాసన సెల్ లో ఉంచాలని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అక్కడ అయితే ఆయన మెడిటేషన్ చేసుకోగలరు. మేము రాజకీయ ప్రత్యర్థులం. కానీ, కేంద్రం ఇప్పుడు రాజకీయ హత్యలకు పాల్పడుతుందా?’’ అని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.

మనీష్ సిసోడియాను వృద్ధుల సెల్ లో ఉంచినట్టు, అందరి మాదిరిగానే బేసిక్ వస్తువులు ఇచ్చినట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు. మీరెన్ని కుట్రలు చేసిన ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులను తామే గెలిచామని బిజెపిని ఉద్దేశిస్తూ భరద్వాజ్ అన్నారు. తమ నేతలను జైలుకు పంపించినా, ప్రజల సానుభూతి తమవైపే ఉన్నట్టు చెప్పారు.