విభజన సమస్యలపై మరోసారి కేంద్ర హోంశాఖ సమావేశం

ఏపీ, తెలంగాణలకు సమాచారం పంపిన కేంద్రం

union-home-ministry

న్యూఢిల్లీః ఈ నెల 23న కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సమాచారం పంపిన హోంశాఖ.. భేటీకి తప్పనిసరిగా రావాలని కోరింది. భేటీలో విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇంతకు ముందు సెప్టెంబర్‌ 27న భేటీలో ఏడు ఉమ్మడి అంశాలపై కేంద్రం చర్చించింది. ఏపీకి సంబంధించి ఏడు అంశాలపై కేంద్ర అధికారులు చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల లోపు పూర్తి చేయాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

ఆ నిబంధనకు అనుగుణంగా రెండేళ్లలో చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తి కానున్నది. గత ఎనిమిదేళ్లు పలు సమస్యలు ఇంకా పెండింగ్‌ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 27న జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలపై ఏ కొలిక్కి రాలేదు. అలాగే ఈ సారి ఏపీ రాజధాని అంశాన్ని సైతం సమావేశం ఎజెండాలో ప్రస్తావించారు. అమరావతికి రైల్వే కనెక్టివికి సంబంధించిన అంశాలను ఎజెండాలో కేంద్రం చేర్చింది. గత సమావేశంలో జరిగిన 14 అంశాలతోనే మరోసారి భేటీ జరుగనున్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/