కాసేపట్లో టీడీపీ, జనసేన ‘జెండా’ సభ..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్లో ఎన్నికల సమరం ఊపందుకుంది. వరుసపెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ నేతలకు , కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం అంటూ సీఎం జగన్ సభలు నిర్వహిస్తుండగా..ఉమ్మడి కూటమి గా ఉన్న జనసేన – టిడిపి ఈరోజు తాడేపల్లి గూడెంలో ‘జెండా’ పేరుతో భారీ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు ఇరు పార్టీల అధినేతలు , పార్టీ నేతలు , కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. దాదాపు ఆరు లక్షల మంది ఈ సభకు హాజరు కాబోతున్నట్లు పార్టీ నేతలు చెపుతున్నారు. రెండు పార్టీల క్యాడర్‌ను రాజధాని స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేసే ప్రధాన లక్ష్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహిస్తున్నారు.

తాడేపల్లిగూడెం బైపాస్‌లో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని అనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు. మొత్తం 33 గ్యాలరీల్లో వీఐపీల కోసం మూడు, మహిళల కోసం మూడు, మీడియాకు ఓ గ్యాలరీని కేటాయించనున్నారు. దాదాపు 5 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేయనున్నారు. కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాలు నిలిపేందుకు సభా ప్రాంగణానికి సమీపంలోనే భారీ పార్కింగ్ స్థలం కేటాయించారు. సభా ప్రాంగణంలో 14 డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.