అండర్ 19 క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత

అండర్‌-19 టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం సాధించి ఉమెన్స్‌ అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచింది. తొలిసారిగా ఇండియన్‌ ఉమెన్‌ క్రికెట్‌ జట్టు ఐసీసీ ట్రోపీని తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో తెలుగమ్మాయి గొంగిడి త్రిష సత్తా చాటింది. అండర్‌ -19 టీ20 వరల్డ్‌ కప్‌లో టాప్‌ స్కోరర్‌గా గొంగిడి త్రిష నిలిచింది. ఈ క్రమంలో విజయం సాధించిన క్రికెటర్లను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు.

తెలంగాణ ఆణిముత్యాలైన త్రిష, యశ శ్రీలు కనబర్చిన ఆటతీరుతో కప్ సాధించడం గర్వంగా ఉందని కవిత అన్నారు. శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విజేతలైన క్రికెటర్లు త్రిష, యశశ్రీలను కవిత సన్మానించారు. ఫైనల్ మ్యాచ్లో త్రిష చివరి దాకా నిలదొక్కుకుని జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచిందని కవిత ప్రశంసించారు. ఈ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, వీరు భవిషత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. వీరి స్ఫూర్తితో రాష్ట్రంలోని యువత కూడా క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించేందుకు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.