రేవంత్ రెడ్డి పాదయాత్ర వివరాలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నెల 06 నుండి పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న రేవంత్ ..ఇప్పుడు పాదయాత్ర తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ఈ యాత్రను ప్రారంభించనున్నారు. 60 రోజుల పాటు తెలంగాణలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు.

కాగా ఈ పాదయాత్ర కు సంబదించిన వివరాలను ఎమ్మెల్యే సీతక్క మీడియా కు తెలిపింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితోనే రేవంత్ రెడ్డి యాత్ర చేపడుతున్నారని ఆమె అన్నారు. అడవి తల్లుల ఆశీర్వాదంతో మేడారం నుండి రేవంత్ పాదయాత్ర మొదలవుతుందని చెప్పారు. ఈ యాత్రలో అన్ని రంగాల ప్రజలు పాల్గొని సంఘీభావం తెలుపాలని సీతక్క పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుని.. పేద ప్రజలకు భవిష్యత్ భరోసా ఇచ్చేదే ఈ పాదయాత్ర అని ఆమె చెప్పుకొచ్చారు.

ఫిబ్రవరి 06 న ఉదయం ములుగులో గట్టమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత.. పస్రాలో నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారని సీతక్క తెలిపారు. అనంతరం పాలంపేటలో నైట్ బస చేసి మరుసటి రోజు ఉదయం అక్కడి ప్రజలను కలవనున్నారు. అక్కడ నుంచి ఘనపూర్, భూపాలపల్లి జంక్షన్ వెల్తూర్ పల్లిలో రెండో రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా ములుగు నియోజకవర్గంలో రెండు బహింగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.