రేపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి : ఉక్రెయిన్ అధ్యక్షుడు

మాకు సమాచారం అందింది..ఫేస్‌బుక్‌లో తెలిపిన వొలోదిమిర్ జెలన్‌ స్కీ


కీవ్‌ : ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున ర‌ష్యా బలగాలను మోహరించడం, ఆ దేశంలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధం కావ‌డం వంటి ప‌రిణామాలు అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా ఏ క్ష‌ణ‌మైనా దాడి చేసే ముప్పు ఉంద‌ని ఇప్ప‌టికే అమెరికా కూడా హెచ్చరించింది.

తాజాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్‌ స్కీ కూడా ఇదే విష‌యాన్ని తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. రేపు (బుధవారం) ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు సమాచారం అందినట్లు చెప్పారు. దేశ‌ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని రేపు ఐక్యతా దినోత్సవం జరుపుకోవాలని సూచించారు.

కాగా, రష్యా ఇప్పటికే సరిహద్దుల్లో లక్షకు పైగా సైనిక బలగాలను మోహరించిన విష‌యం తెలిసిందే. దీనిపై నాటో దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడానికి సిద్ధ‌మైంద‌ని అమెరికా ప‌లుసార్లు ప్ర‌క‌టించింది. అయితే, అమెరికా ప్ర‌క‌ట‌న‌ను ర‌ష్యా మాత్రం కొట్టిపారేస్తోంది. ర‌ష్యా దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని అమెరికా హెచ్చ‌రిస్తోంది. అయిన‌ప్ప‌టికీ, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ ర‌ష్యా త‌మ బ‌ల‌గాల‌ను భారీగా మోహ‌రిస్తోంది. బెలారస్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు ఉన్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/