నేడు భారత్ బంద్..

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న ఆర్మీ అభ్యర్థులు రెరోజు (సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్ ను రద్దు చేసుకొని, ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాలనే డిమాండ్ తో పలు రాష్ట్రాల అభ్యర్థులు బంద్ తలపెట్టారు. అయితే ఈ బందుకు ఎలాంటి అనుమతి లేదని కేంద్రం, అన్ని రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. బంద్ పేరుతో ఎవరైనా రోడ్డెక్కితే కఠిన సెక్షన్ల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. హర్యానా, ఝార్ఖండ్‌, పంజాబ్‌, కేరళ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి.

ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌లో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైల్వేల్లో హైఅలర్ట్ కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంది. నిరసనకారులు చొరబడకుండా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు.

అగ్నిపథ్ పై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నా.. ఆ పథకాన్ని రద్దు చేయబోమని కేంద్రం, త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఇకపై సాధారణ నియామకాలు ఏవీ ఉండబోవని, అగ్నిపథ్ పథకం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీలు చేస్తామని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుండబద్దలు కొట్టారు. త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.