లాఫింగ్ గ్యాస్ పీల్చి ప్రాణాలు కోల్పోయిన చెస్ జంట

మాస్కోలో ఉంటున్న ఉక్రెయిన్ చెస్ క్రీడాకారుడు

Young Ukraine Chess Couple Killed By Laughing Gas
Young Ukraine Chess Couple Killed By Laughing Gas

మాస్కో: ఉక్రెయిన్‌కు చెందిన స్పీడ్ చెస్ చాంపియన్ స్టానిస్‌లావ్ బోగ్డానోవిచ్ (27), అతడి స్నేహితురాలు అలెగ్జాండ్రా వెర్నిగోరా (18)లు మాస్కోలోని తమ ఫ్లాట్‌లో మృతి చెందారు. నవ్వులు తెప్పించే లాఫింగ్ గ్యాస్‌ను పీల్చడం వల్లే వీరు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. వారి ఫ్లాట్‌లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు కనిపించడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. కాగా ఉక్రెయిన్‌కు చెందిన బోగ్డానోవిచ్ మాస్కోలో ఉంటున్నాడు. ఇటీవల ఇంటర్నెట్ చెస్ పోటీల్లో రష్యా తరపున బరిలోకి దిగి ఉక్రెయిన్‌పై విజయం సాధించాడు. అయితే లాఫింగ్ గ్యాస్ (నైట్రస్ ఆక్సైడ్)ను శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగిస్తుంటారు. ఈ గ్యాస్‌ను పీల్చినప్పుడు అది రక్తంలో కలిసిపోయి సహజ సిద్ధమైన మత్తు పదార్థాలైన ఎండార్ఫిన్లు, డోపమైన్‌ విడుదలకు కారణమవుతుంది. అంతేకాదు, ఈ గ్యాస్ శరీరంలోకి వెళ్లగానే నవ్వాలన్న భావన కలుగుతుంది. అందుకనే దీనికి లాఫింగ్ గ్యాస్ అని పేరొచ్చింది. అయితే, సరదా కోసం దీనిని సొంతంగా పీల్చిన సమయాల్లో అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తుంటాయి. ఈ యువ చెస్ జంట మరణం కూడా ఆ కోవలోనిదేనని భావిస్తున్నారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/