ఐరాసలో పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ

కొందరు భారతీయులను తీవ్రవాదులుగా చిత్రీకరించే యత్నం

అడ్డుకున్న భద్రతామండలి సభ్యదేశాలు

UNO
UNO

న్యూయార్క్‌: పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొందరు భారతీయులను పాక్ తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అందుకు భద్రతా మండలి చెక్ చెప్పింది. కొందరు భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్‌ ఐరాస తీవ్రవాద నిరోధక కమిటీ ముందు కొన్ని పేర్లను ఉంచిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. విదేశాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని కోరింది. చివరకు ఆ ఆరోపణలపై భద్రతా మండలికి పాకిస్థాన్ ఆధారాలు ఇవ్వలేకపోయింది. దీంతో పాకిస్థాన్‌ చర్యను అమెరికా సహా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. కాగా, భారత్‌పై పాక్ ఇటువంటి కుట్రలు పన్నడం కొత్తేమీకాదు.‌ ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత ఏడాది కూడా ప్రయత్నాలు జరపగా అవి కూడా ఫలించలేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/