బోరిస్ జాన్సన్‌కు షాక్.. మంత్రి రిషి సునాక్ రాజీనామా

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. బోరిస్ నేతృత్వంలోని సర్కార్ సరైన రీతిలో నడవడం లేదని ఆ ఇద్దరూ ఆరోపించారు. ప్రభుత్వాన్ని వీడడం బాధగా ఉందని, కానీ ప్రభుత్వాన్ని ఇలా కంటిన్యూ చేయలేమని రిషి సునాక్ తెలిపారు. ప్రభుత్వం సరైన విధానంలో నడవాలని, పోటీతత్వంతో ఉండాలని ప్రజలు భావిస్తారని, కానీ జరగడం లేదన్నారు. బహుశా ఇదే తన చివరి మంత్రి పదవి అంటూ తన లేఖలో తెలిపారు.
ప్రధాని బోరిస్ జాన్సన్ సామర్థ్యంపై తనకు నమ్మకం పోయినట్లు జావెద్ తెలిపారు. బోరిస్ నాయకత్వంలో పరిస్థితులు మారవని స్పష్టం అవుతోందని, అందుకే నమ్మకం సడలినట్లు జావెద్ తన రాజీనామా లేఖలో తెలిపారు. ఇద్దరు కీలక మంత్రుల రాజీనామా నేపథ్యంలో ప్రధాని బోరిస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం మారింది. కరోనా వేళ నియమావళి ఉల్లంఘించి పార్టీలు నిర్వహించిన బోరిస్ పార్టీగేట్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. కానీ బోరిస్ మాత్రం తలొగ్గడంలేదు. మంత్రులు రాజీనామా చేసినా.. కొత్త క్యాబినెట్‌ను విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/