మోడీ ఆపని చేస్తే..మునుగోడు ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటాం – ఎర్రబెల్లి

మునుగోడు ఉప ఎన్నిక ఫై సర్వత్రా చర్చగా మారింది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం మొదలుకావడం తో పార్టీ నేతలంతా మునుగోడు లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా మునుగోడు లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి తమ అభ్యర్థి ని గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి బిజెపి కి సవాల్ విసిరారు.

మోడీ చేత తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశం మొత్తం అమలు చేయిస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తే ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటామని సవాల్ చేశారు ఎర్రబెల్లి. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కు వారి మాట మీద నిలకడ లేదని ఎర్రబెల్లి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటే అసెంబ్లీలోనే సమాధానం చెప్పానన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మునుగోడు ప్రజలు క్లారిటీతో ఉన్నారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం నల్గొండలో మీటింగ్ పెట్టినా.. రాజగోపాల్ హాజరుకాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్టానికి ఏం చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆక్షేపించారు. కోమటరెడ్డి ప్యాకేజీ కోసమే బీజేపీలో చేరాడని.., ఆ విషయాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారన్నారు.

ఇక రేపు టిఆర్ఎస్ అభ్యర్థి గా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ నుంచి చండూర్ వరకు భారీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు వెల్ల‌డించారు. టీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో సీపీఐ, సీపీఎం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా భారీ సంఖ్య‌లో పాల్గొననున్న‌ట్లు తెలిపారు.