ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసారు. బలపరీక్షకు సుప్రీం కోర్టు అనుమతివ్వడంతో థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం పదవితో పాటు ఎంఎల్సీగానూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానన్న ఆయన.. ప్రజాస్వామ్య విలువల్ని తప్పక పాటిస్తానని చెప్పారు.

సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ప్రజలను ఉద్దేశించి ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కృతజ్ఞతలు చెప్పారు. బాలా సాహెబ్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేశామని అన్నారు. ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని, అది ఎవరిదో అందరికీ తెలుసన్న ఠాక్రే.. సొంత పార్టీ వాళ్లే తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రిక్షావాలాను మంత్రిని చేస్తే.. ఆయనే తనకు ద్రోహం చేశారంటూ పరోక్షంగా ఏక్‌నాథ్‌ శిందేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తో కలిసి పోటీచేసిన శివసేన.. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి బిజెపి తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి 2019 నవంబర్ 26న మహావికాస్‌ అఘాడీ కూటమికి ఉద్ధవ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 28న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్సీపీ, భాజపా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ కొద్దిరోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరిగి ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా ప్రకటన చేసిన వెంటనే బిజెపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ముంబయిలోని ఒక హోటల్‌లో సమావేశమైన ఎమ్మెల్యేలు స్వీట్స్ పంచుకున్నారు.